CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 9:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ఘనంగా సేవా జ్యోతి యాత్ర

  • హుస్నాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు బైక్‌ ర్యాలీ.. వికసిత్‌ భారత్‌–2047 సాధనకు సంకల్పం

హుస్నాబాద్‌, అక్టోబరు 7 (చైతన్యగళం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా, వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనకు సంకల్పంగా నిర్వహిస్తున్న పీఎం సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి సేవా జ్యోతి యాత్రను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు.

కోహెడ క్రాసింగ్‌, బస్వాపూర్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్‌ వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ అధ్యక్షతన సేవా జ్యోతి జిల్లా సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఎల్‌ఈడీ తెర ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ వర్చువల్‌గా ప్రసంగించారు.

అనంతరం కొండ భూదేవి గార్డెన్‌ నుంచి వేంకటేశ్వర ఆలయం వరకు మరోసారి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సేవా సంకల్ప అభియాన్‌ జిల్లా కన్వీనర్‌ ఖమ్మం వేంకటేశం, అసెంబ్లీ కన్వీనర్‌ గుర్రాల లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి పైడిపల్లి పృథ్వీరాజ్‌, రాష్ట్ర నాయకులు లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, తోట స్వరూపతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేసేందుకు హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ స్ఫూర్తితో వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.