- సామాజిక సేవ, విద్యా–వైద్య రంగాల్లో విశేష కృషి.. రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 7(చైతన్యగళం): తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థిత్వంపై ఆ వర్గంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సామాజిక సేవకుడు, వైద్యుడు డా. పెండెం కృష్ణకుమార్ పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించాలని పలువురు పద్మశాలీయులు కోరుతున్నారు.
విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో డా. కృష్ణకుమార్ దీర్ఘకాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన మద్దతుదారులు తెలిపారు. సొంత నిధులతో సుమారు 500 పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా, క్రీడా సామగ్రి, టేబుల్–బెంచీలు అందించడంతో పాటు వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుమారు 400 పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కరోనా సమయంలోనూ ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టారని మద్దతుదారులు పేర్కొన్నారు. కళారంగంలోనూ ఆయనకు గుర్తింపు ఉందని, 2009 జూలై 9న సూర్యాపేటలో ఒకే రాత్రి తొమ్మిది వేర్వేరు నాటక ప్రదర్శనల్లో అత్యధిక పాత్రలు పోషించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవలో కొనసాగుతున్న డా. కృష్ణకుమార్ వంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే పద్మశాలి సమాజానికి మరింత గౌరవం దక్కుతుందని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన సేవలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.