- పోషణ మాసం సందర్భంగా పందిల్లలో పౌష్టికాహార ప్రదర్శన
హుస్నాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో అంగన్‌వాడీ ఆధ్వర్యంలో పోషణ మాసం మహోత్సవాలను మంగళవారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించారు. గ్రామ మహిళలు చిరుధాన్యాలు, తృణధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల పిండివంటలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జయప్రద మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల విటమిన్ల లోపంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. ఉత్తమ వంటకాలు తీసుకొచ్చిన మహిళలకు అంగన్‌వాడీ టీచర్ శారద ఆధ్వర్యంలో సర్పంచ్ తోడేటి రమేష్, పాలకవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు.
అనంతరం బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) పందిల్ల గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సమన్వయకర్త రాజు, సునీత, ఉపసర్పంచ్ పెండ్యాల సంపత్‌రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ మహిళలు పాల్గొన్నారు.