CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఈసీని బీజేపీ అనుబంధ సంస్థలా మార్చేశారు!

  • అర్హులైన పేదల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

కోహెడ, అక్టోబరు 6 (చైతన్యగళం): కేంద్ర ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. సోమవారం కోహెడ మండలం నకిరికొమ్ములలో ఆయన మాట్లాడుతూ బీజేపీ విధానాలను వ్యతిరేకించే పేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, బిహార్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజకీయ పార్టీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ ఉద్యమం

ఓటు హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఓట్ల పరిరక్షణకు కాంగ్రెస్‌తో పాటు ప్రజాస్వామిక పార్టీలన్నీ కలిసి ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ ఉద్యమాన్ని చేపడుతున్నాయని తెలిపారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈసీ తీరు మారకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.