CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:40 am Posted by : CHAITHANYA GALAM NEWS

కార్మికుల హక్కుల పోరాటాల్లో ధ్రువతార వెంకటస్వామి

  • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు: మండిగ రేణుక రాజనర్సయ్య

ఎలిగేడు, అక్టోబరు 5 (చైతన్యగళం): కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు మాజీ కేంద్రమంత్రి జి.వెంకటస్వామి (కాక) అని పెద్దపల్లి మాజీ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక రాజనర్సయ్య అన్నారు. సోమవారం ఎలిగేడులో వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల కోసం వెంకటస్వామి చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తొలిదశ, మలిదశలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఏడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన వెంకటస్వామి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిస్సీ క్రిస్టినా, ఎలిగేడు మాజీ సర్పంచ్‌ మండిగ రాజనర్సయ్య, నాయకులు వెంకటేష్‌, జానీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.