సైదాపూర్, అక్టోబర్ 6(చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం గర్రెపల్లి గ్రామంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తాలో తక్కువ ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చౌరస్తా వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దసరా, దీపావళి, బతుకమ్మ వేడుకల సమయంలో మహిళలు, పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తారని, ఆ సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న తీగలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఛత్రపతి శివాజీ జయంతి, వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలోనూ తీగలు తగిలే ప్రమాదం ఉందన్నారు.
మరోవైపు పశుగ్రాసం, పత్తి తదితర వ్యవసాయ ఉత్పత్తులను ట్రాక్టర్లపై తరలించే సమయంలోనూ విద్యుత్ తీగలు తగులుతున్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా ముందుగానే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుత్ తీగలను ఎత్తుకు మార్చడంతో పాటు అవసరమైన చోట ఎత్తైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, తీగలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్‌ఎస్ గ్రామ శాఖ దోకిడి అధ్యక్షుడు తిరుపతి కోరారు.