- మహబూబాబాద్‌లో భారీ ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట మహాధర్నా
మహబూబాబాద్, అక్టోబరు 6 (చైతన్యగళం): ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ తదితర పార్టీల ఆధ్వర్యంలో సోమవారం మహబూబాబాద్‌లో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. కన్నన్న కాలనీ పెట్రోల్ బంక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరుతూ మహా ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.