CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:13 pm Posted by : CHAITHANYA GALAM NEWS

‘కాకా’ వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

  • హుస్నాబాద్‌లో ఘనంగా 97వ జయంతి వేడుకలు

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 5 (చైతన్యగళం): పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన మాజీ కేంద్రమంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ‘కాకా’ వెంకటస్వామి సేవలను కాంగ్రెస్‌ నాయకులు స్మరించుకున్నారు. ఆయన 97వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ.. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. పెద్దపల్లి ఎంపీగా పలుమార్లు విజయం సాధించిన ఆయన కేంద్రంలో జౌళి, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారని తెలిపారు. చేనేత, బీడీ కార్మికుల సంక్షేమంతోపాటు తెలంగాణ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిలోనూ ఆయన పాత్ర మరువలేనిదన్నారు.

మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లో వీవర్స్‌ కాలనీ, బీడీ కార్మికుల కాలనీ ఏర్పాటుకు కాకా వెంకటస్వామి కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, భావితరాలకు ఆయన సేవలు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో ఆయన చరిత్రను చేర్చాలని కోరారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి కాకా వెంకటస్వామి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు సైతం ప్రజాసేవ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు కేశవేణి రమేష్‌, గోపగోని శోభన్‌ గౌడ్‌, వైద్యం కిరణ్‌ ప్రసాద్‌, బొలిశెట్టి రాజు, పిల్లి తిరుపతి, పూజారి వరప్రసాద్‌, బూరుగు లత, కోఆప్షన్‌ సభ్యురాలు భూక్య సరోజన, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, పట్టణ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు బూరుగు కృష్ణస్వామి, గురాల సంజీవరెడ్డి, చెన్నవేని విద్యాసాగర్‌, సావుల రాజయ్య, పూదరి శ్రీనివాస్‌, గట్టు రాములు, కోడం ప్రభాకర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.