CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలి

  • ప్రతి శక్తికేంద్రం నుంచి ఐదు బైకులతో తరలిరావాలి: కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబరు 5 (చైతన్యగళం): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు కృతజ్ఞతగా, వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యంతో ఈ నెల 7న నిర్వహించనున్న సేవా జ్యోతి కలశం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుస్నాబాద్‌ అసెంబ్లీ కేంద్రం నుంచి ఉదయం 9 గంటలకు బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతి శక్తికేంద్రం నుంచి ఐదు బైకులు, ప్రతి పోలింగ్‌ బూత్‌ నుంచి ఒక బైక్‌తో పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. హుస్నాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల నుంచి వచ్చే ర్యాలీలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలుస్తాయని చెప్పారు.

అక్కడ ఎల్‌ఈడీ తెరపై ప్రధాని మోదీ ప్రసంగాన్ని పార్టీ శ్రేణులు సామూహికంగా వీక్షిస్తారని తెలిపారు. కార్యక్రమానికి మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, పలువురు మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.