హుస్నాబాద్ అక్టోబర్ 5 (చైతన్యగళం):
హుస్నాబాద్ పట్టణంలోని హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ ట్రాక్టర్ ద్విచక్రవాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
మున్సిపల్ సిబ్బంది చెత్తను సేకరిస్తూ ట్రాక్టర్ను రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు వేగంగా వస్తూ ట్రాక్టర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాదం ధాటికి బైక్‌పై ఉన్న నద్దునూరి శ్రీకాంత్, నరసింహలకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై తీవ్ర రక్తస్రావం కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
మూడో వ్యక్తి నద్దునూరి శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.