- సమతుల్య ఆహారంతోనే ఆరోగ్యకరమైన జీవనం
- అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ మాలోతు మణి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ నాయక్
అక్కన్నపేట, అక్టోబర్ 5 (చైతన్యగళం): విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, చురుకుదనం, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార కార్యక్రమం అభినందనీయమని గ్రామ సర్పంచ్ మాలోతు మణి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ నాయక్ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బొల్లం శ్వేత ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టిక అల్పాహారంతో పాటు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడం వల్ల వారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విద్యార్థులతో కలిసి వారు అల్పాహారాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కవిత, పంచాయతీ కార్యదర్శి అశోక్, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు రమా, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.