- మంత్రి హామీ ఇచ్చి ఏడాది గడిచినా పనులు పూర్తికాలేదు
- బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమ విభాగం నాయకుడు మాంకాల రమేష్
కోహెడ, అక్టోబర్ 3 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోయ తుమ్మెద వాగు వద్ద బతుకమ్మ, గౌరమ్మ నిమజ్జనానికి మహిళలు సురక్షితంగా వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమ విభాగం నాయకుడు మాంకాల రమేష్ కోరారు. శనివారం ఆయన వాగు వద్ద బతుకమ్మ ఘాట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు గౌరమ్మను నిమజ్జనం చేసేందుకు రోడ్డుపై నుంచి వాగులోకి దిగాల్సి వస్తోందని, దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఘాట్ వద్ద మెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గత ఏడాది రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ వెళ్తున్న సమయంలో మోయ తుమ్మెద వాగును సందర్శించారని రమేష్ తెలిపారు. ఆ సమయంలో గ్రామస్థులు మెట్లు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, సానుకూలంగా స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత నాయకులకు సూచించారని పేర్కొన్నారు.
అయితే ఏడాది గడిచినా ఇప్పటివరకు మెట్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలకు గురికాకుండా వెంటనే మెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ప్రజాపాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
