- 100 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీ
కోహెడ, అక్టోబర్ 3 (చైతన్యగళం): రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నిర్మల జయరాజ్, వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సతీష్ అన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కోహెడ మండల రైతు వేదికలో శనివారం వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శెట్టి సుధాకర్, కోహెడ సర్పంచ్ బండెల సుజాత–బాలకిషన్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కరివేద చంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ కొనసాగుతున్నట్లు తెలిపారు. జాతీయ తినదగిన నూనెలు–నూనెగింజల పథకం కింద కదిరి లేపాక్షి–1812 రకం వేరుశనగ విత్తనాలను రైతులకు 100 శాతం రాయితీతో అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
మండలానికి మొత్తం 200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక్క సంచి 30 కిలోలు ఉండగా, అది అర ఎకరాకు సరిపోతుందని, రెండు సంచులు అంటే 60 కిలోలు ఒక ఎకరాకు సరిపోతాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మైపాల్‌రెడ్డి, శివకుమార్, పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.