CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:19 am Posted by : CHAITHANYA GALAM NEWS

పంచాయతీ అవసరాలపై ప్రణాళిక సిద్ధం చేయాలి

  • గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల గుర్తింపు

మిర్యాలగూడ, అక్టోబరు 2 (చైతన్యగళం‌): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొట్యానాయక్‌ తండా, గూడూరు గ్రామపంచాయతీల్లో గురువారం ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభలు నిర్వహించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2027–28లో భాగంగా గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని అధికారులు సూచించారు.

వి.బి.జి. రామ్‌జీ పథకం కింద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి గ్రామానికి ఊటకుంట, రైతులకు ఫామ్‌పాండ్‌, బోర్‌వెల్‌ల రీచార్జి గుంతలు, ఇళ్లపై వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద డ్రెయిన్‌ చివరల్లో సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గ్రామంలో ఉన్న ఆస్తులు, చేపడుతున్న పనులు, సమస్యలు, కొత్తగా చేపట్టాల్సిన పనులను గుర్తించి 375 ప్రతిపాదనల్లో అవసరమైన వాటిని ఎంపిక చేయాలని సూచించారు.

నాలుగు రకాల చెత్త వేరు చేయడం, ఎస్‌బీఎం నిబంధనలు–2026పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’లో భాగంగా మొక్కలు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొట్యానాయక్‌ తండాలో చెత్తబుట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌ చక్రవర్తి, ఎంపీడీవో ఎం. శేషగిరిశర్మ, డివిజనల్‌ పంచాయతీ అధికారి రాఘవరావు, ఏపీడీ గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్‌ పి. శ్రీనివాస్‌, ఎంపీవో మాతంగి రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.