CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 4:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బి. హరి వెంకట ప్రసాద్‌కు ‘కిసాన్ సేవా రత్న’ అవార్డు

  • రైతుల సేవలకు గుర్తింపుగా పురస్కారం

హైదరాబాద్‌, అక్టోబరు 2 (చైతన్యగళం): రైతుల సేవలకు గుర్తింపుగా బి. హరి వెంకట ప్రసాద్‌కు ‘కిసాన్ సేవా రత్న’ అవార్డు లభించింది. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండరెడ్డి అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.

రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలు, సేవలు రైతులకు అందేలా సమన్వయం చేయడం వంటి సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఎం. కోదండరెడ్డి ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న హరి వెంకట ప్రసాద్‌ రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాల్లో క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తూ సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.

అవార్డును రైతులకు అంకితం చేస్తున్నట్లు హరి వెంకట ప్రసాద్‌ తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి మరింత బాధ్యతతో పనిచేస్తూ, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.