CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:01 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆగమోత్కూరు పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు

  • సొంత పాఠశాలలోనే విద్యార్థులకు అవగాహన కల్పించిన హెడ్‌ కానిస్టేబుల్‌ మౌజీస్‌ హుస్సేన్‌

మాడ్గులపల్లి, అక్టోబరు 1 (చైతన్యగళం): నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ ఆదేశాలు, షీ టీం సీఐ శైలజ సూచనల మేరకు మిర్యాలగూడ షీ టీం ఆధ్వర్యంలో ఆగమోత్కూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

షీ టీం హెడ్‌ కానిస్టేబుల్‌ మహమ్మద్‌ మౌజీస్‌ హుస్సేన్‌, కానిస్టేబుళ్లు రాజేశ్వరి, మధు విద్యార్థులకు మైనర్‌ డ్రైవింగ్‌ వల్ల కలిగే ప్రమాదాలు, ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌, సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థినులకు మంచి స్పర్శ–చెడు స్పర్శ, బాల్య వివాహాల నివారణ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడం, కార్లలో సీటు బెల్టు వినియోగం, డయల్‌–100, షీ టీం వాట్సాప్‌ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని వివరించారు.

ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్‌ మౌజీస్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ తాను చిరుమర్తి గ్రామంలో పుట్టి పెరిగి, ఆగమోత్కూరు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలలోనే ప్రస్తుతం పోలీసు శాఖలో పనిచేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదవాలని సూచించారు.

కార్యక్రమానికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు యెలేటి వినోద్‌కుమార్‌, ఉపాధ్యాయులు జనార్దన్‌, నరేందర్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌, అనంతరెడ్డి, బ్లాండినా, రామజ్యోతి, సీఆర్పీ వెంకన్నతో పాటు విద్యార్థినీ విద్యార్థులకు షీ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.