CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:47 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాలి.. గ్రామాల అభివృద్ధి పనులకు వేగం పెంచాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

  • 15 రోజుల్లో మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక

 

కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): జిల్లాలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును వేగవంతం చేసేందుకు 15 రోజుల్లో మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మండలాల అభివృద్ధిలో ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు.

నూతన కలెక్టరేట్‌ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం రాత్రి ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్‌ పనులు, విద్య, వైద్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రణాళిక అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.

గ్రామాల్లో పర్యటించి సమస్యలు గుర్తించాలి

ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ సందర్శించి విద్యార్థులు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రారంభమైన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, వీవో భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జలసిరి పనులను విస్తృతంగా చేపట్టాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి

మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. రెండో విడత ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.

నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ పథకంపై గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని ఆదేశించారు. నిధుల వినియోగంపై ప్రణాళిక విభాగం అధికారులతో కలెక్టర్‌ అవగాహన కల్పించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.