CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 11:01 am Posted by : CHAITHANYA GALAM NEWS

జిల్లా ఛాంపియన్లకు అభినందనలు

  • జాతీయస్థాయి యోగా పోటీల్లో రాణించాలి: కన్న కృష్ణ

కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): ఇటీవల కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్‌ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులను జిల్లా యోగా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ అభినందించారు. కరీంనగర్‌లోని తారక హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. అక్టోబరు 3 నుంచి 6 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జాతీయస్థాయి యోగా పోటీలు జరగనున్నట్లు తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఏ. నవతేజ, కిర్ప సూరజ్‌, ఎం. ఇషాని, బి. తన్నోజ్‌, బి. రిషిక, ఎన్‌. ఆదిత్య, జి. శ్రీహర్ష, టి. హర్షిత్‌ బాలాజీ, పి. దీపక్‌, రంజిత్‌ (కరీంనగర్‌), టి. కమాలిని (జగిత్యాల), ఎం. తేజస్విని (పెద్దపల్లి), వీ. కీర్తన, డి. వైష్ణవి (రాజన్న సిరిసిల్ల) ఎంపికయ్యారు.

కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్‌ కార్యదర్శి గుంటి రామకృష్ణ, కోచ్‌లు సీహెచ్‌. గంగాధర్‌, వి. కిష్టయ్య, పి. మల్లేశ్వరి, ఏ. ఆనంద్‌కిషోర్‌, ఎం. వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.