CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:44 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నారాయణపూర్‌పై కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

  • గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దు: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, అక్టోబరు 1 (చైతన్యగళం): నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 100 శాతం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. గ్రామస్తులు అపోహలకు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రిజర్వాయర్‌ ప్రభావం, ముంపు పరిస్థితులు, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.­

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ఇటీవల నారాయణపూర్‌ గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్‌.. గురువారం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, ప్రత్యేక ఉప కలెక్టర్‌ రాజేశ్వరి, గంగాధర తహసీల్దార్‌ రజిత తదితర అధికారులతో కలిసి రిజర్వాయర్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సుమారు 350 కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, భూసేకరణ, ముంపు ప్రభావం, సాగు భూములు, ఇళ్లు, ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

కార్యాలయాల్లో లభించిన వివరాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రిజర్వాయర్‌ వల్ల ఏ ప్రాంతాలకు పాక్షికంగా, ఏ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో ప్రభావం ఏర్పడే అవకాశం ఉందనే అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించారు. చర్లపల్లి, మంగపేట గ్రామాల్లోనూ రిజర్వాయర్‌ ప్రభావంతో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలిస్తామని తెలిపారు.

పది శాఖలతో ప్రత్యేక కమిటీ

నారాయణపూర్‌ సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు పది శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, భూగర్భ జలాలు, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, భూసర్వే తదితర శాఖల అధికారులు కమిటీలో ఉంటారని చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలు, భూసేకరణ, ముంపు ప్రభావం, భూముల పరిస్థితి, ప్రజలకు కలిగే నష్టాన్ని కమిటీ పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తుందని తెలిపారు.

భూసేకరణకు సంబంధించి గ్రామస్తులకు అభ్యంతరాలు, సందేహాలు లేదా సమస్యలు ఉంటే అధికారులకు రాతపూర్వకంగా సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం న్యాయం చేస్తామని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఎమ్మెల్యే

నారాయణపూర్‌ రిజర్వాయర్‌ సమస్యను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలనే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించడంతో పాటు సంబంధిత మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే సమక్షంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

గ్రామస్తుల సహకారంతో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. గ్రామస్తులు అపోహలను నమ్మకుండా శాంతియుతంగా తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు.