CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 1:29 pm Posted by : CHAITHANYA GALAM NEWS

రెడ్‌క్రాస్‌ సొసైటీలో పారదర్శకతకు తూట్లు

  • ఏళ్లుగా జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించలేదని ఆరోపణ..
  • రికార్డులు బహిర్గతం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): ప్రజాసేవ, మానవతా సేవల కోసం ఏర్పడిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ జిల్లా శాఖలో పరిపాలన పారదర్శకంగా సాగడం లేదని అడ్వకేట్‌, మాజీ కార్పొరేటర్‌ ఎ.వి. రమణ ఆరోపించారు. ఏళ్ల తరబడి వార్షిక సర్వసభ్య సమావేశాలు సక్రమంగా నిర్వహించలేదని సభ్యుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.

జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించకపోవడంతో సొసైటీ కార్యకలాపాలు, నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ–వ్యయ వివరాలపై సభ్యులకు పూర్తి సమాచారం అందడం లేదని రమణ పేర్కొన్నారు. సొసైటీ నియమ నిబంధనలు, గత సమావేశాల వివరాలు, ఆడిట్‌ నివేదికలు, వార్షిక లెక్కలు, ఆదాయ–వ్యయ పట్టికలు తదితర రికార్డులను సభ్యులు పరిశీలించే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బైలాస్‌, సభ్యత్వ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు, ఆడిట్‌ నివేదికలు, ఆర్థిక రికార్డులను ముందుగా సభ్యులందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు. సొసైటీ వ్యవహారాలపై సభ్యుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు రికార్డులను పరిశీలించి అవసరమైతే స్వతంత్ర విచారణ లేదా ప్రత్యేక ఆడిట్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, రికార్డులను సభ్యులకు అందుబాటులో ఉంచిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని రమణ డిమాండ్‌ చేశారు. నిబంధనల ఉల్లంఘనలు లేదా ఆర్థిక అవకతవకలు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్‌క్రాస్‌ సొసైటీలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విధానాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.