CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 2:07 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రకృతి సేద్యంతోనే నాణ్యమైన పంటల దిగుబడి

  • రసాయన రహిత సాగుతో ఆరోగ్యకరమైన ఆహారం: ఏఈఓ రాజ్‌కుమార్‌

నిర్మల్‌, సెప్టెంబరు 30 (చైతన్యగళం‌): రసాయన మందుల విచక్షణారహిత వినియోగంతో పండించిన పంటలను తీసుకోవడం వల్ల వినియోగదారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మాదాపూర్‌ క్లస్టర్‌ ఏఈఓ రాజ్‌కుమార్‌ అన్నారు. రసాయన రహితంగా చేపట్టే ప్రకృతి సేద్యంతో నాణ్యమైన పంటల దిగుబడి సాధించవచ్చని తెలిపారు.

బుధవారం లోకల్‌ వెల్మల్‌ గ్రామపంచాయతీలో ప్రకృతి సేద్యం ప్రాజెక్టులో భాగంగా వేస్ట్‌ డీకంపోజర్‌ తయారీ విధానంపై సర్పంచ్‌ చాతిరి గంగాధర్‌ అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని 125 మంది రైతులకు ప్రకృతి సేద్యంపై సమగ్ర శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ప్రశాంత్‌, కృషి సఖీలు జ్యోతి, స్వప్న, స్థానిక రైతులు పాల్గొన్నారు.