CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:18 am Posted by : CHAITHANYA GALAM NEWS

రైల్వే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • బోనస్‌పై రూ.7 వేల పరిమితి ఎత్తివేయాలి: యుగంధర్‌ యాదవ్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 29 (చైతన్యగళం): రైల్వే కార్మికులకు అందించే ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ)పై ఉన్న రూ.7 వేల గరిష్ట పరిమితిని ఎత్తివేసి, వాస్తవ వేతనాల ఆధారంగా బోనస్‌ చెల్లించాలని మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, ఎస్‌సీఆర్‌ఎంయూ వరంగల్‌ బ్రాంచ్‌ కార్యదర్శి యుగంధర్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మజ్దూర్‌ యూనియన్‌ పిలుపు మేరకు మంగళవారం మహబూబాబాద్‌ పి.వే. కార్యాలయం ఎదుట రైల్వే కార్మికులు ఆందోళన చేపట్టారు.

కార్మికులపై అదనపు పనిభారం తగ్గించి సురక్షిత పని వాతావరణం కల్పించాలని యుగంధర్‌ యాదవ్‌ కోరారు. ట్రాక్‌మెయింటెయినర్ల గస్తీ పరిధిని 12 కిలోమీటర్లకు పరిమితం చేయాలని, కీమెన్‌ల అదనపు విధులను ఉపసంహరించుకోవాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఏర్పడిన ఆస్తులకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఓవర్‌టైమ్‌, ప్రయాణ భత్యాల బకాయిలు, సెలవు నగదీకరణ, పిల్లల విద్యా భత్యాలను వెంటనే చెల్లించాలని కోరారు. రాత్రి గస్తీకి ఇద్దరు పెట్రోల్‌మెన్‌లను నియమించాలని, అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి, శాఖాపరమైన పరీక్షల అవకాశాలు కల్పించాలని, రైల్వే ఆసుపత్రుల్లో సిబ్బందిని నియమించాలని, ట్రాక్‌మెయింటెయినర్లు, లోకో పైలట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మరింత విస్తృత ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కార్యదర్శి బాబురావు, ఇంజినీరింగ్‌ కో-ఆర్డినేటర్‌ సతీష్‌, యూత్‌ నాయకులు కనకయ్య, గోపీలాల్‌, జైల్‌సింగ్‌, రాజు, రమేష్‌, సంతోష్‌, నరేందర్‌, రవి, వరుణ్‌, లత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.