CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 3:34 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ముదిరాజుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి

  • బీసీ ‘ఏ’ రిజర్వేషన్‌పై హామీ ఏమైంది?
  • 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్‌ ఇవ్వాలి: జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌

సిద్దిపేట, సెప్టెంబరు 29 (చైతన్యగళం): ముదిరాజ్‌ సమాజం ప్రధాన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ముదిరాజ్‌ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిద్దిపేటలో మీడియా రాష్ట్ర కన్వీనర్‌ పాతర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిచర్ల సతీష్‌, జిల్లా కన్వీనర్‌ రావుల రాజుతో కలిసి ఆయన మాట్లాడారు.

ముదిరాజ్‌ సమాజానికి బీసీ ‘ఏ’ రిజర్వేషన్‌ కల్పిస్తామని ఇచ్చిన హామీపై ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, తదుపరి కార్యాచరణను స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికలు, ప్రజా కార్యక్రమాల్లో ఇచ్చే హామీలు ప్రకటనలకే పరిమితం కాకుండా అమలుకు స్పష్టమైన విధానం రూపొందించాలని అన్నారు. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన ముదిరాజ్‌ సింహగర్జనలోనూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు ప్రత్యేక పింఛన్‌ పథకం అమలు చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి అర్హుడికి సామర్థ్య పరీక్షలతో సంబంధం లేకుండా మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉచిత చేపపిల్లల పంపిణీలో పారదర్శకత పాటించి, చెరువుల సామర్థ్యానికి అనుగుణంగా సొసైటీలకు చేపపిల్లలు కేటాయించాలని కోరారు.

మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి అమలవుతున్న పథకాలు, లబ్ధిదారులు, మత్స్య సహకార సంఘాల పరిస్థితి, చేపపిల్లల పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వం సమగ్ర సమాచారాన్ని ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని శ్రీనివాస్‌ ముదిరాజ్‌ తెలిపారు.