సిద్దిపేట, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా మహిళా సమాఖ్య సమావేశం అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వినోద్ కుమార్ హాజరై మహిళలకు సంబంధించిన ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. అడిషనల్ డిఆర్డిఓ సుధీర్ కుమార్ మాట్లాడుతూ భవనాలు లేని గ్రామ సంఘాలు భవనాల నిర్మాణానికి స్థలాలను త్వరగా సేకరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అక్టోబర్ 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమానికి 60 సంవత్సరాలు పైబడిన మహిళా వృద్ధుల సంఘాల అధ్యక్షులను పంపించాలని తెలిపారు డీపీఎం ఐబీ ప్రకాష్ మాట్లాడుతూ సంఘాలు పటిష్టంగా ఉన్నప్పుడే ఇతర సంస్థల నుంచి సహకారం లభిస్తుందని తెలిపారు. సంఘాలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు పుస్తక నిర్వహణను ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు డీపీఎం ఫుడ్ ప్రాసెసింగ్ డి. వాసుదేవ్ మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు డీపీఎం మార్కెటింగ్ విద్యాసాగర్ మాట్లాడుతూ త్వరలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని, బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని నూతన సంస్థలు ఏర్పాటు చేసుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలని కోరారు ఏపీవో ఇన్‌చార్జ్ పెన్షన్ సరిత మాట్లాడుతూ ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించి యూడీఐడీ సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీ సేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.సహకార సంఘాల చట్టం ప్రకారం జిల్లా మహిళా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, పదాధికారులకు ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షురాలుగా సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన అల్లం దీప, ప్రధాన కార్యదర్శిగా హుస్నాబాద్ మండలానికి చెందిన శ్రీలత, కోశాధికారిగా మద్దూరు మండలానికి చెందిన ప్రతినిధి ఎన్నికయ్యారు. అనంతరం నూతన పదాధికారులతో పాటు మాజీ అధ్యక్షురాలు రేణుకను ఘనంగా సన్మానించారు.
సమావేశానికి టీజీ మాస్ రిప్రెజెంటేటివ్ మురళి హాజరై సమావేశ నిర్వహణను పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు. ఏపీఎం ఐబీ డాకయ్య, సీబీఓ ఆడిటర్లు వేణు, ప్రసాద్, బాలకిషన్, బ్రహ్మచారి, అన్ని మండలాల మహిళా సమాఖ్యల అధ్యక్షులు, జిల్లా సమాఖ్య మేనేజర్ హేమలత, సిబ్బంది సుమలత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.