- రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్.. పోలీసులతో తోపులాట
మహబూబాబాద్, సెప్టెంబరు 29 (చైతన్యగళం): హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మానుకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి నెహ్రూ సెంటర్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెహ్రూ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మ దహనం సందర్భంగా బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొందరు బీజేపీ నాయకులకు స్వల్ప గాయాలైనట్లు వారు తెలిపారు.
పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీ నాయకులపై దాడి చేసిందని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల స్పందన తెలియాల్సి ఉంది.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ ఇన్‌చార్జి యాల్దీ మల్లయ్య, 26వ వార్డు కౌన్సిలర్ మాలోతు శ్రీదేవి బాలునాయక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్‌సుందర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేస్మా, జిల్లా కార్యదర్శి ధార ఇందుభారతి, రూరల్ మండల అధ్యక్షుడు జయేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు రవినాయక్, నరేష్, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి హుస్సేన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దిడ్డి మహేష్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు రవి యాదవ్, మాలోతు బాలునాయక్, ప్రతాప్‌రెడ్డి, బొబ్బ సురేందర్, సంతోష్, సుజాత, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు మార్గం శైలజ, గాడిపల్లి శ్యామ్, యశ్వంత్, జాన్సన్ అనిల్, బీజేవైఎం నాయకులు మాలే సాయి, ఎస్టీ మోర్చా నాయకుడు కేలోతు గణేష్ తదితరులు పాల్గొన్నారు.