హుస్నాబాద్, సెప్టెంబరు 28 (చైతన్యగళం):
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సోమవారం ప్రతిజ్ఞ చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఈ ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్. రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడిన వారిని నేరస్తులుగా చూడకుండా వైద్యం, కౌన్సెలింగ్, పునరావాసం ద్వారా సాధారణ జీవనంలోకి తీసుకురావాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.
ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారి తిరునహరి రణధీర్‌కుమార్, అధ్యాపకులు, గ్రంథపాలకులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.