- కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలి: సీఎస్ సంజయ్ జాజు
కరీంనగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. విద్యార్థుల భద్రత, హాజరు, భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల పనితీరు, అభ్యసన ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా, అధికారులు పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు, భోజనం, వంటశాలలు, పారిశుద్ధ్యం, హాజరుపై కలెక్టర్లు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీఎస్ సూచించారు.
యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేసి 2027 విద్యా సంవత్సరం నాటికి కనీసం 15 నుంచి 20 పాఠశాలలను పూర్తి చేయాలని ఆదేశించారు. పెంచిన భోజన, సౌందర్య సామగ్రి ఖర్చుల ప్రయోజనాలు విద్యార్థులకు అందేలా చూడాలని, ఆహార నాణ్యత, వంటశాలల పరిశుభ్రతపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదును సమర్థంగా అమలు చేయాలని, గైర్హాజరయ్యే ఉపాధ్యాయులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కేంద్రీకృత వంటశాలల పనులను నవంబరు మధ్య నాటికి పూర్తి చేయాలని, ప్రస్తుత యూనిఫారాల తయారీని అక్టోబరు 20 నాటికి పూర్తిచేయాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన యూనిఫారాలను మే 30 నాటికి సిద్ధం చేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ప్రయోగశాలలను పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడాలని, సంక్షేమ వసతి గృహాల మౌలిక వసతులు, హాజరు, భోజనం, పారిశుద్ధ్యాన్ని సమగ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించి పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలను తరచూ సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ స్వామి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వివిధ సంక్షేమ వసతి గృహాల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.