- గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ రెంటాల కృష్ణ, మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్
కురవి, సెప్టెంబర్ 28(చైతన్యగళం): గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి దాతలు ముందుకు రావాలని కురవి మండలం నల్లెల్ల గ్రామ సర్పంచ్ రెంటాల కృష్ణ, మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్ పిలుపునిచ్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నల్లెల్ల గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమాన్ని వారు అభినందించారు.
వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఆయన ఆరుగురు కుమారులు, వారి కుటుంబ సభ్యులు పీఆర్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లెల్ల గ్రామంలోని వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనానికి నీటి సౌకర్యం కల్పించేందుకు ఉచితంగా బోరుబావి వేయించారు. బోరుబావి ఏర్పాటుకు సంబంధించిన పనులను సర్పంచ్ రెంటాల కృష్ణ, మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వెంకన్న గుప్త కుటుంబ సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రెంటాల కృష్ణ మాట్లాడుతూ.. వైకుంఠధామాల నిర్వహణకు, అక్కడికి వచ్చే ప్రజల అవసరాలకు నీటి వసతి ఎంతో కీలకమన్నారు. వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి శ్మశానవాటికలో ఉచితంగా బోరుబావి వేయించి, మోటారు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులతో పాటు దాతలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు.


మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్ మాట్లాడుతూ.. “కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం” అని పేర్కొన్నారు. కుల, మత, ధనిక, పేద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అంతిమ సంస్కారాలు సగౌరవంగా నిర్వహించే పవిత్ర స్థలాలుగా వైకుంఠధామాలు నిలుస్తున్నాయని అన్నారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు బాధలో ఉన్న సమయంలో అంతిమ సంస్కారాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వెంకన్న గుప్త కుటుంబ సభ్యులు బోరుబావి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వెంకన్న గుప్త ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణమూర్తి, గ్రామపంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు ఎడ్ల ఉప్పలయ్య, అంబటి మల్లికార్జున్ గౌడ్, మహబూబాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆవుల కందయ్య, వెంకన్న గుప్త కుమారులు ప్రొద్దుటూరి వాసుదేవు గుప్త, హరేందర్ గుప్త, ప్రొద్దుటూరి సత్యనారాయణ గుప్తతో పాటు గ్రామ పెద్దలు షేక్ ముస్తఫా, అంబటి కరుణాకర్, బండి దీపక్ గౌడ్, శీలం కరుణాకర్, పల్లా వాసురెడ్డి, బండి ఉప్పలయ్య గౌడ్, బండి మల్లయ్య గౌడ్, పల్లా సత్తిరెడ్డి, తోట యాదయ్య, ఎస్‌డీ ఖాజా, మల్లన్నస్వామి ఆలయ పూజారి లింగస్వామి, తోట నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.