- దేశానికి మనమేం చేయగలమో ఆలోచించాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్, సెప్టెంబరు 28 (చైతన్యగళం): భగత్‌సింగ్ త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ‘నా దేశం.. నా జాతి.. నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మేయర్ క్యాంపు కార్యాలయంలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశానికి తాను ఏమి ఇవ్వగలననే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని మేయర్ అన్నారు. చిన్న వయసులోనే జలియన్‌వాలాబాగ్ ఘటనతో ప్రభావితమైన భగత్‌సింగ్ స్వాతంత్ర్య సాధన కోసం జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి చేసిన పోరాటం, ప్రాణత్యాగం చిరస్మరణీయమన్నారు.
భగత్‌సింగ్ దేశభక్తి, నిర్భయత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశాభివృద్ధి, సమాజ సంక్షేమానికి కృషి చేస్తూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కే. యాదవరాజు, కన్వీనర్ ఎం.డి. తాహిర్ పాషా, కార్యకర్తలు, డివిజన్ పెద్దలు పాల్గొన్నారు.