మహబూబాబాద్, సెప్టెంబర్ 28:(చైతన్యగళం) : దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయస్సులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన షహీద్ భగత్‌సింగ్ ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని డా. డుంగ్రోత్ కుమార్ నాయక్ అన్నారు. సోమవారం మానుకోటలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. కుమార్ నాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగం చిరస్మరణీయమన్నారు. నేతాజీ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కందుల నాగరాజు మాట్లాడుతూ.. భగత్‌సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా విప్లవ యువకుడిగా దేశ యువతలో చైతన్యం రగిలించారని పేర్కొన్నారు.
రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు తదితర విప్లవ వీరులతో కలిసి భగత్‌సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించారని అన్నారు. అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధి, ప్రజాసేవ, సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఉప కార్యదర్శి కుర్యావుల గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనగిరి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, ప్రముఖ బిల్డర్ షేక్ యూసుఫ్, చిట్టిమల్ల రఘు, డా. శ్రీనివాస్, ఆకారపు రవి, గర్రెపల్లి రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.