CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 4:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

  • నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చుల్లో CMRF భరోసా: సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌

యాచారం, సెప్టెంబరు 27 (చైతన్యగళం): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) భరోసాగా నిలుస్తుందని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌ అన్నారు. గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు.

సర్పంచ్‌ ముచ్చర్ల సుగుణ సంపత్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మోటే శ్రీశైలం, ఉప సర్పంచ్‌ దెంది మధుకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కందుకూరి బాల్‌రాజ్‌ కలిసి సిందం నరసింహ, పొలమనే కలమ్మ, జక్కర్త వరమ్మ, అలంపల్లి మహేష్‌, జంపాల రాములు తదితరులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.

మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మోటే శ్రీశైలం మాట్లాడుతూ అర్హులైన వారు సంబంధిత ఆసుపత్రి బిల్లులు సమర్పిస్తే నిబంధనల మేరకు ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ సాయం అందేలా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో వార్డు సభ్యులు ముచ్చర్ల మాధవి ప్రకాష్‌, ఆడాల శ్రీకాంత్‌, ఎరుకలి జ్యోతి కృష్ణ, సిందం రవి తదితరులు పాల్గొన్నారు.