CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 11:00 am Posted by : rakeshkashaveni12@gmail.com

విద్యానగర్‌లో రూ.70 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం

కరీంనగర్, సెప్టెంబర్ 26 (చైతన్య గళం):

నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం 21వ డివిజన్ విద్యానగర్‌లో స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

యూఐడీఎఫ్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్ పనులకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీంలో నగరాన్ని చేర్చి రూ.840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి ప్రక్రియ పూర్తి చేశామని, త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రి చొరవతో మరో రూ.30 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నగరపాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాల డివిజన్లకు ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అన్ని డివిజన్లను మోడల్ డివిజన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిని నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను సూచించారు. పనులు జరుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించవద్దని కాంట్రాక్టర్లను హెచ్చరించారు.

కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.