CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 10:51 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ద్వారకామాయి నిలయంలో ఘనంగా సుదర్శన హోమం

  • భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు.. ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26(చైతన్యగళం): పట్టణంలోని ద్వారకామాయి నిలయంలో సుదర్శన హోమ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామకృష్ణ–నర్మదా దంపతుల ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ ముడుంబై లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం తదితర కార్యక్రమాలు నిర్వహించి అనంతరం సుదర్శన చక్ర భగవానునికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ముడుంబై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుదర్శన హోమం విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని తెలిపారు. ఇటువంటి యజ్ఞయాగాదులు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు ధర్మం, సనాతన సంప్రదాయాలపై విశ్వాసాన్ని బలపరుస్తాయని అన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.

హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, ఆధ్యాత్మిక అభిమానులు పాల్గొన్నారు.