CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 11:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బధిరులకు న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి

  • పారా లీగల్‌ వాలంటీర్లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి సూచన

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): సమాజంలోని బధిరులను గుర్తించి వారికి ఉచిత న్యాయ సేవలు, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి పారా లీగల్‌ వాలంటీర్లకు సూచించారు. ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పారా లీగల్‌ వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బధిరులను గుర్తించి వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, సలహాలు, హక్కులపై అవగాహన కల్పించడం పారా లీగల్‌ వాలంటీర్ల బాధ్యత అన్నారు. వినికిడి లోపం లేదా భావ వ్యక్తీకరణలో ఇబ్బందుల కారణంగా ఎవరూ న్యాయానికి, చట్టపరమైన రక్షణకు దూరం కాకుండా చూడాలని సూచించారు.

పారా లీగల్‌ వాలంటీర్లు తమ పరిధిలోని బధిరులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. న్యాయపరమైన సమస్యలు, హక్కుల ఉల్లంఘనలు ఎదురైతే వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చి తగిన న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పలువురు పారా లీగల్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.