CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:22 am Posted by : rakeshkashaveni12@gmail.com

అటవీ భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

కరీంనగర్, సెప్టెంబర్ 25 (చైతన్య గళం):

జిల్లాలోని అటవీ భూములు, వన్యప్రాణుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖ, వన్యప్రాణుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ అధికారులతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో అటవీ శాఖ భూములు ఉన్నాయని, ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీఎఫ్‌ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ వద్ద ఎన్టీఆర్ బొమ్మ సమీపంలో అటవీ శాఖ చెక్‌పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ ఎన్‌ఓసీ ఇచ్చిన తర్వాతే మైనింగ్ అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరుకుల్ల ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో అటవీ శాఖ భూములకు సరిహద్దులు నిర్ణయించాలని పేర్కొన్నారు.

సైదాపూర్ మండలం రాయికల్ వాటర్‌ఫాల్స్‌కు జన సందడి పెరుగుతున్నందున అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులు కోరారు.

వన్యప్రాణుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌ఓ సత్యనారాయణ తెలిపారు. ఎల్‌ఎండీకి వివిధ రకాల పక్షులు వస్తుంటాయని, డ్యాంలో మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలతో పక్షులకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. దీనిపై మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించాలని కోరుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఆర్‌ఓలు షోకత్ హుస్సేన్, లత తదితరులు పాల్గొన్నారు.