- ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో 117 మంది వివాహిత మహిళలు.. హామీలు అమలు చేయాలని వినతి
హుస్నాబాద్, సెప్టెంబరు 26 (చైతన్యగళం): గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వివాహిత ముంపు బాధిత మహిళలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించాలని బాధితులు కోరారు. శనివారం హుస్నాబాద్ ఆర్డీఓను కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు.
గత ప్రభుత్వం రూపొందించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జాబితాలో 117 మంది వివాహిత మహిళలతో పాటు ఇతర బాధితులను చేర్చినట్లు వారు తెలిపారు. పరిహారం అందిస్తామని పలుమార్లు హామీలు ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలోనూ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ జాబితాలో ఉన్న తమకు నిబంధనల ప్రకారం పరిహారం అందించి న్యాయం చేయాలని ఆర్డీఓను కోరారు.