CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 10:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పోలీసులపై దాడులను ఉపేక్షించేది లేదు

  • తానంచర్ల మాజీ సర్పంచ్‌ సహా ఆరుగురు అరెస్టు.. మరో 11 మందిపై కేసు

మరిపెడ, సెప్టెంబరు 26(చైతన్యగళం): పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, సిబ్బందిపై దాడులకు పాల్పడటాన్ని ఉపేక్షించబోమని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్‌ తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా తానంచర్లలో చోటుచేసుకున్న ఘటనపై మాజీ సర్పంచ్‌ సహా ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 23, 24 తేదీల మధ్య అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో తానంచర్లలో వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే శబ్దాలతో ఇబ్బందులు కలుగుతున్నాయని డయల్‌-112కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మరిపెడ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రహదారి నుంచి పక్కకు వెళ్లాలని సూచించగా కొందరు దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్‌ను జాతీయ రహదారిపై అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారని తెలిపారు.

ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు తానంచర్ల మాజీ సర్పంచ్‌ దిగజర్ల ముఖేష్‌, దయ్యాల విక్రమ్‌, దిగజర్ల గణేష్‌, సీత అంజి, జానీ హుస్సేన్‌, పాశం కృష్ణలను అరెస్టు చేశారు. మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

డీఎస్పీ కృష్ణ కిషోర్‌ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడం, దాడులకు పాల్పడటం వంటి చర్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర స్వభావం, గత ప్రవర్తన, చట్టపరమైన నిబంధనల మేరకు అర్హత ఉన్న సందర్భాల్లో రౌడీషీట్లు ప్రారంభిస్తామని, అనుమతులు లేకుండా డీజేలు నిర్వహించే వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దని సూచించారు.