CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 11:02 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన సమాజం

  • రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి.. క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (చైతన్యగళం): ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలోని జైపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జాతీయ మిషన్‌ ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో 17 క్లస్టర్లకు చెందిన 34 మంది సీఆర్పీలకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన పంటలు, కూరగాయల ఉత్పత్తిని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ప్రోత్సాహకాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

శిక్షణలో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ, ఘనజీవామృతం, జీవామృతం, బీజామృతం, దశపర్ణి కషాయం తదితరాలను ఆధునిక పద్ధతుల్లో తయారు చేసే విధానాలపై శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రంలో ఏర్పాటు చేసిన అధునాతన జీవామృతం తయారీ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. రైతులకు అవసరమైన శిక్షణతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి. మరియన్న, శాస్త్రవేత్త మల్యాల ప్రశాంత్‌, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామారావు, నాగేశ్వరరావు, తహసీల్దార్‌ వివేక్‌, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.