CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 9:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వైద్య పీజీ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన డాక్టర్ జ్యోతిర్మయి

  • 7,346వ ర్యాంకు సాధించినందుకు ఆర్యవైశ్య సంఘం ఘన సన్మానం

మహబూబాబాద్, సెప్టెంబర్ 25(చైతన్యగళం): 
ఆల్ ఇండియా మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో 7,346వ ర్యాంకు సాధించిన మహబూబాబాద్‌కు చెందిన డాక్టర్ జ్యోతిర్మయిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జ్యోతిర్మయిని శాలువాతో సత్కరించి, పూలమాలలు, మెమొంటోతో అభినందించారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. జ్యోతిర్మయి సాధించిన ర్యాంకు ఆమె ప్రతిభ, పట్టుదల, కృషికి నిదర్శనమని కొనియాడారు. వైద్య విద్యలో ఉన్నత స్థాయికి ఎదిగి, భవిష్యత్‌లో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆమె విజయం తల్లిదండ్రులతో పాటు మహబూబాబాద్ ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.

డాక్టర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. తాను సాధించిన ర్యాంకు వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి ఎంతో ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి, చదువులో ఎల్లప్పుడూ ప్రోత్సహించిన తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాన్ని సాధించగలిగానని తెలిపారు. తన కృషిని గుర్తించి ఘనంగా సన్మానించిన మహబూబాబాద్ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు, సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు గిరిధర్ గుప్తా, 19వ వార్డు కౌన్సిలర్ చిదిరాల అరుణ, జ్ఞానేశ్వర్ గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాళ్ల నరసింహారావు, వేమిశెట్టి కిషోర్, ఇమ్మడి కృష్ణమూర్తి, నాళ్ల వీరన్న, వేణుగోపాల్, శ్రీరంగం ఉపేందర్, మాలె శ్రావణ్, ఇమ్మడి రవి, జంగాల సదాశివుడు, మా శెట్టి రవికుమార్, లక్ష్మీకాంతారావు, ఈగ రమేష్, కోదుమూరు వీరభద్రం, కొత్త సోమన్న, సోమ శ్రీనివాస్, గెల్లి మురళి, ఇందిరా, నాళ్ల మహేశ్వరి, జంగాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.