CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:27 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎన్ఎస్ఎస్‌ సేవా స్ఫూర్తిని విద్యార్థులు అలవర్చుకోవాలి: ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌

హుస్నాబాద్‌, సెప్టెంబరు 24 (చైతన్యగళం): విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములుగా తీర్చిదిద్దడంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయడంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్‌) పాత్ర కీలకమని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నూరి గంగాధర్‌ అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన ఎన్ఎస్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

1969లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్‌ విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా, హింసకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేస్తోందన్నారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘నా కోసం కాదు.. మీ కోసం’ అనే ఎన్ఎస్ఎస్‌ ధ్యేయ వాక్యాన్ని ప్రతి వాలంటీర్‌ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

పరిశుభ్రమైన వాతావరణం, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కళాశాల విద్య అనంతరం కూడా సమాజానికి తాను ఏమి చేయగలననే ఆలోచన ప్రతి విద్యార్థిలో ఉండాలని పిలుపునిచ్చారు.

ఎన్ఎస్ఎస్‌ కార్యక్రమ అధికారి తిరునహరి రణధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. హృదయంలో సేవాభావం ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. అనంతరం విద్యార్థులు, వాలంటీర్లు, అధ్యాపకులతో ఎన్ఎస్ఎస్‌ ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో అధ్యాపకులు డా.ఎస్‌.ఎస్‌.రాజు, సుధగోని సత్యనారాయణ, వి.సదాశివ్‌, బి.ఎల్లయ్య, బి.వాల్య, ఎస్‌.వెంకట ముత్యం, సిహెచ్‌.విద్యాసాగర్‌, పి.చంద్రమోహన్‌, సిహెచ్‌.రాజిరెడ్డి, ఎస్‌.అశోక్‌, ఎం.వెంకటేష్‌, ఏ.మమత, గ్రంథపాలకులు ఆర్‌.వాసవి, వెంకటసాయి, ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.