-
సామాజిక సేవలో వాలంటీర్లు చురుగ్గా పాల్గొనాలి: ప్రిన్సిపల్ వి.లలిత
హుస్నాబాద్, సెప్టెంబరు 24 (చైతన్యగళం): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ఎన్ఎస్ఎస్ చైర్మన్ వి.లలిత అధ్యక్షతన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వి.లలిత మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అంకితభావంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు, సామాజిక అవగాహన ర్యాలీలు, ప్రత్యేక శిబిరాల్లో చురుగ్గా పాల్గొని సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి డి.కరుణాకర్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం, లక్ష్యాలు, నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. మొక్కల పెంపకం, ట్రాఫిక్ నియంత్రణ, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో వాలంటీర్లు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డి.రవీందర్, ఎస్.సదానందం, టి.నిర్మలాదేవి, బి.లక్ష్మయ్య, ఎ.సంపత్, ఎస్.కవిత, కే.స్వరూప, జి.కవిత, ఓ.రాణి, జూనియర్ అసిస్టెంట్లు కే.గీతాంజలి, ఎస్.రాములు, రికార్డు అసిస్టెంట్ టి.రమాదేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.