CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 11:17 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కేంద్ర నిధుల రోడ్లకు కాంగ్రెస్‌ క్రెడిట్‌ సరికాదు- రామంచ మహేందర్‌రెడ్డి

అక్కన్నపేట, సెప్టెంబరు 24 (చైతన్యగళం): కేంద్ర నిధులతో మంజూరైన రోడ్లకు కాంగ్రెస్‌ నాయకులు క్రెడిట్‌ తీసుకోవడం సరికాదని అక్కన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అన్నారు. బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వాస్తవాలు వెల్లడిస్తే.. కాంగ్రెస్‌ మండల నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతకపేట నుంచి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వరకు, హుస్నాబాద్‌ నుంచి రామవరం వరకు సీఐఆర్‌ఎఫ్‌ నిధులతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ రోడ్లు మంజూరు చేయించారని ఆయన తెలిపారు. వాటికి కాంగ్రెస్‌ నాయకులు క్రెడిట్‌ తీసుకోవడం సరికాదని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల పనులపై ప్రశ్నలు

అక్కన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి రోజులు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభం కాలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని రామంచ మహేందర్‌రెడ్డి కోరారు. గ్రామాలు, గ్రామపంచాయతీల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని కోర్టు కేసులు కొట్టివేసినా పనులు ఎందుకు ప్రారంభించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. మిగిలిన ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలను వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు.