CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గణేష్‌ నిమజ్జనానికి పటిష్ఠ భద్రత

  • 20 వేల మంది పోలీసులతో బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా
  • ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): గణేష్‌ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న నగరవ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు, ట్రాఫిక్‌ ఆంక్షలను ప్రకటించారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణనాథుల నిమజ్జనాల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నగరంలో సుమారు 20 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొననుండగా.. ఇతర జిల్లాల నుంచి 8,400 మంది పోలీసులను అదనంగా రప్పిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర మార్గాలపై నిఘా కోసం 24 డ్రోన్లను వినియోగించనున్నారు. సుమారు 10 వేల సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంతో అనుసంధానం చేశారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో 100 హైరైజ్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు

నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టనున్నారు. ప్రైవేట్‌ బస్సులు, ప్రైవేట్‌ ట్రక్కులను నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ప్రజలు ముందుగానే ట్రాఫిక్‌ ఆంక్షలను తెలుసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

విద్యుత్‌, అగ్నిమాపక, జలమండలి, హైడ్రా, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ మఫ్టీలో నిఘా చేపట్టనున్నాయి. చైన్‌ స్నాచింగ్‌, ఇతర చోరీలను అరికట్టేందుకు 25 ప్రత్యేక నేర నియంత్రణ బృందాలను రంగంలోకి దించనున్నారు.

నిబంధనలు పాటించాలి

ఖైరతాబాద్‌ గణనాథుడి దర్శనాలకు బుధవారం అర్ధరాత్రి వరకు మాత్రమే అనుమతి ఉండనుందని అధికారులు తెలిపారు. నిమజ్జనానికి విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు సమయం అవసరమైనందున అనంతరం దర్శనాలను నిలిపివేయనున్నారు.

నిమజ్జన శోభాయాత్రల్లో అసభ్యకర నృత్యాలు, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, అభ్యంతరకర పాటలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు.