CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:10 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

  • 18,700 మంది ఓటర్లు హియరింగ్‌కు హాజరు కావాలి: అదనపు కలెక్టర్‌ చెన్నయ్య

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం‌): జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఐఆర్‌ పురోగతిని వివరించారు.

జిల్లాలో ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్‌ పూర్తయిందని, మరో 18,700 మంది నోటీసులు అందుకుని హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు బీఎల్‌ఓల సమక్షంలో హాజరై అవసరమైన పత్రాలు సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు షెడ్యూల్‌ను కూడా సమావేశంలో వివరించారు. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా నవంబరు 6లోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితా నవంబరు 25న, తుది జాబితా డిసెంబరు 30న ప్రచురించనున్నట్లు తెలిపారు.

అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తప్పిపోకుండా రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.