త్రీఫేస్ కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని సర్పంచుల ఆగ్రహం
మర్రిగూడ, సెప్టెంబరు 22 (చైతన్యగళం): మర్రిగూడ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విద్యుత్ సరఫరాపై వాడీవేడిగా చర్చ జరిగింది. యరగండ్లపల్లి సర్పంచ్ వల్లెంల సంతోష్‌యాదవ్, రాజపేట తండా సర్పంచ్ కోడాల వెంకట్‌రెడ్డి విద్యుత్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీధిదీపాలు పనిచేయడం లేదని వారు ఆరోపించారు. విద్యుత్ స్తంభాలు కావాలని కోరినా అందించడం లేదని, విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో అభివృద్ధి పనులు, వ్యవసాయం, ఉపాధిహామీ పథకాల పురోగతిపై చర్చించారు. రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ప్రత్యేక అధికారి వేణుగోపాల్, ఎంపీడీవో మున్నయ్య, విద్యుత్ శాఖ ఏఈ సందీప్, పలువురు సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.