CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:22 am Posted by : CHAITHANYA GALAM NEWS

వ్యవసాయ పనిముట్ల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

  • సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి గుర్తింపు..జ్యుడీషియల్ రిమాండ్‌

గౌరవెల్లి, సెప్టెంబరు 23 (చైతన్యగళం): వ్యవసాయ పొలంలోని లాకర్‌ గది తాళం పగలగొట్టి వ్యవసాయ పనిముట్లు, స్ప్రే బాటిళ్లు, ఇతర సామగ్రి చోరీ చేసిన కేసులో చౌటపల్లి గ్రామానికి చెందిన మహిళాగౌరవేని శంకర్‌ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

గౌరవెల్లి గ్రామానికి చెందిన బొజ్జపురి వేణు జనగామ గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో లాకర్‌ గది నిర్మించుకుని వ్యవసాయ పనిముట్లు, స్ప్రే బాటిళ్లు, ఇతర సామగ్రిని భద్రపరుస్తున్నారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు లాకర్‌ గది తాళం, తలుపు పగలగొట్టి సామగ్రిని చోరీ చేసినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా.. చౌటపల్లి గ్రామానికి చెందిన గౌరవేని శంకర్‌ లాకర్‌ గదిలోకి ప్రవేశించి సామగ్రిని తీసుకెళ్లినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, గతంలో బోర్‌ మోటార్‌ వైర్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

అనంతరం నిందితుడిని చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.