CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:11 pm Posted by : CHAITHANYA GALAM NEWS

యువ సంస్కృతి వారసత్వ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

  • జిల్లాస్థాయి పోటీల్లో హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థుల ప్రదర్శన

హుస్నాబాద్‌, సెప్టెంబరు 22 (చైతన్యగళం): యువ సంస్కృతి, వారసత్వ జిల్లా స్థాయి పోటీల్లో హుస్నాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ, వనరుల కేంద్రంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్వల్పచిత్రం, నాటిక, దృశ్య ప్రదర్శన, ప్రదేశాల పరిశుభ్రత, వారసత్వ నడక తదితర విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. హుస్నాబాద్‌ ప్రాంతంలోని చారిత్రక, పర్యాటక, వారసత్వ ప్రదేశాలను కేంద్రంగా చేసుకుని ప్రదర్శనలు రూపొందించారు. ఆయా ప్రాంతాల చారిత్రక ప్రాధాన్యత, వారసత్వ సంపద, వాటి పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు.

ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమం ద్వారా పర్యాటక, వారసత్వ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. చారిత్రక, పర్యాటక, వారసత్వ ప్రదేశాలను తెలుసుకోవడంతో పాటు వాటి విశిష్టతను ప్రజలకు తెలియజేసి, భవిష్యత్‌ తరాల కోసం పరిరక్షించాల్సిన అవసరం ఉందని విద్యార్థులు సందేశమిచ్చారు.

విద్యార్థుల ప్రతిభను కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నూరి గంగాధర్‌ అభినందించారు. విద్యతో పాటు స్థానిక చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, వారసత్వ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.