CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 9:25 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఫిజియోథెరపీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి

  • ప్రభుత్వాన్ని కోరిన తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (చైతన్యగళం): తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఫిజియోథెరపీ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని తెలంగాణ ఫిజియోథెరపిస్టుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డా.కందుల నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు యూనియన్‌ ప్రతినిధులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. 2017 తర్వాత రాష్ట్రంలో ఫిజియోథెరపిస్టుల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక్క రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 13, వైద్య విద్య సంచాలకుల పరిధిలో 43 ఫిజియోథెరపీ పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీవో ఎంఎస్‌ నంబర్‌ 69 ప్రకారం 2024 మార్చిలో 46 పోస్టులకు ఆర్థిక అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ సేవలను బలోపేతం చేయాలని, ఐపిహెచ్‌ఎస్‌–2022 ప్రమాణాల ప్రకారం పడకల సంఖ్యకు అనుగుణంగా ఫిజియోథెరపిస్టుల పోస్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్‌సీఏహెచ్‌పీ చట్టం–2021 ప్రకారం రాష్ట్ర అనుబంధ ఆరోగ్య వృత్తుల మండలిని ఏర్పాటు చేయాలని కోరారు.

ఫిజియోథెరపీ విద్యార్హతకు తగిన వేతన శ్రేణిని అమలు చేయాలని, బీపీటీ పూర్తి చేసి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపకార వేతనం లేదా విద్యా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శారీరక, కండరాల, ఎముకల, అభివృద్ధి సంబంధిత అవసరాల కోసం ఫిజియోథెరపీ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు.

పునరావాసం, వృద్ధుల సంరక్షణ, నాడీ సంబంధిత సమస్యలు, కీళ్ల సమస్యలు, పక్షవాతం అనంతర పునరావాసం, పిల్లల అభివృద్ధి సమస్యల్లో ఫిజియోథెరపీ సేవలు కీలకమని నాగరాజు తెలిపారు. తమ సమస్యలను మంత్రి సానుకూలంగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి ఆయేషా, ఐఏఎస్‌ను కూడా కలిసి ఫిజియోథెరపీ సేవలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు.

కార్యక్రమంలో యూనియన్‌ ప్రతినిధులు డా.రవికుమార్‌ వర్మ, డా.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.