- కబడ్డీ క్రీడాకారులకు జెర్సీలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, సెప్టెంబరు 22 (చైతన్యగళం): క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను త్వరగా పొందవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధమవుతున్న సిద్దిపేట జిల్లా జట్టును బుధవారం ఆయన అభినందించారు.
హుస్నాబాద్‌లో గత పది రోజులుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్న జిల్లా జట్టు క్రీడాకారులకు మంత్రి జెర్సీలు అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి సిద్దిపేట జిల్లాతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యతో పాటు క్రీడలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించాలని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేట జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.