CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 2:24 am Posted by : rakeshkashaveni12@gmail.com

కలెక్టరేట్‌లో గణనాథుడికి ఘన పూజలు

కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం):

విఘ్నాలు తొలగి జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ కరీంనగర్ కలెక్టరేట్‌లో కొలువుదీరిన గణనాథుడికి జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు.

పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బందికి స్వయంగా భోజనం వడ్డించి వారితో ఆత్మీయంగా మెలిగారు. కలెక్టర్ స్వయంగా సిబ్బందికి భోజనం వడ్డించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విధి నిర్వహణలో అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేస్తున్న కలెక్టర్.. గణేష్ ఉత్సవాల సందర్భంగా వారితో కలిసి అన్నదానంలో పాల్గొని ఆత్మీయతను చాటారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి. శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.